రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు దక్కించుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా అటవీ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ(ఎఫ్‌ఏసీ) ఈ మేరకు నిర్ణయం చేసింది. అటవీ అనుమతులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ మంగళవారం మినిట్స్ జారీ చేసింది. దీంతో 3,168.13 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకునేందుకు నీటి పారుదల శాఖకు లైన్‌క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే.
గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. ఈ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణానికి భూసేకరణ, అటవీ అవసరాలు భారీగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణతో పాటు 3,168.13 హెక్టార్లు(7,920.72 ఎకరాల) మేర అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్లు(34,265 ఎకరాలు) పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అటవీ అనుమతులు కీలకంగా మారాయి.