తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్ ద్వారా కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వచ్చి ప్రగతిమైదాన్ పక్కన కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (కేఎస్డీసీ)ను ప్రారంభిస్తారు. అక్కడే నిర్మించిన ఆరోగ్యలక్ష్మీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. వార్డు ఎంపవర్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ప్రగతిమైదాన్లో జరుగనున్న బహిరంగసభలో నిరుద్యోగ యువతీ యువకులను, డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్య కేఎస్ఎం వద్ద నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశంలో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.
మణుగూరులో మంత్రి కేటీఆర్ పర్యటన
మంగళవారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ మణుగూరులో పర్యటించనున్నారు. రూ.2.20 కోట్ల వ్యయంతో మణుగూరు ప్రధాన రహదారిలో కోడిపుంజుల వాగుపై నిర్మించిన వంతెనకు తొలుత ప్రారంభోత్సవం చేసి మణుగూరులో పర్యటనను ప్రారంభిస్తారు. మణుగూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి పథకానికి కమలాపురం వద్ద ప్రారంభోత్సవం చేస్తారు. మణుగూరు సమీపంలోని 220 కేవీ సబ్ స్టేషన్ వద్ద సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుంచి కూనవరం రైల్వేగేట్ వరకు రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మణుగూరు జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ హైస్కూల్ ప్రాంగణలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
- ఈ నెల 5 న మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు..