వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇదివరకే చెప్పామని… అధికార టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, చెయ్యకున్నా వై సీపీ ఎంపీలు మాత్రం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తారని మరోసారి తేల్చి చెప్పారు.. రాజీనామాలు సమర్పించి అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీ భవన్ కు వెళ్లి..ఏపీ భవన్‌లోనే నిరాహార దీక్షకు దిగుతారు అని చెప్పారు.
అయితే ఏపీ భవన్‌లో వై సీపీ ఎంపీలు చేపట్టబోయే నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిలోకం, యువతరం సంఘీభావం తెలపాలని జగన్ విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీలు కూడా మనతో కలిసి వస్తే, మొత్తానికి మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలుచేసి ఆమరణ దీక్షకు దిగితే.. వారికి మద్దతుగా రాష్ట్రమంతటా నిరసనలు జరిగితే కేంద్రం తప్పక దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ మాదిరి అవకాశాల గనిలా మారుతుంది అని పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.