పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది .
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ కూడా మమతకు పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుతో మమత కాసేపు ముచ్చటించారు. అనంతరం మమత.. సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ ప్రతినిధులను సచివాలయంలోకి తీసుకెళ్లారు.
గుణాత్మక మార్పు కోసం తొలి అడుగు: సీఎం కేసీఆర్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలనాపరంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై సీఎం కేసీఆర్ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ తప్ప దేశానికి దేశాన్ని పాలించింది ఎవరని సీఎం అన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గుణాత్మక మార్పు కోసం తొలి అడుగుపడిందని చెప్పారు. ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ పార్టీల కోసం కాదు. ప్రజల కోసమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.