ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. కాబట్టే వారిని ఎన్నికల్లో గెలిపించుకునే సాహసం చేయని అసమర్థ ముఖ్యమంత్రి మీరు’ అంటూ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 105వ రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా.. అని ప్రశ్నించారు. మనందరి ప్రభుత్వం రాగానే రైతులకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానివ్వనని హామీ ఇచ్చారు.