ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు వెంకటాపురంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యేందుకుగాను సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అనంతపురంకు చేరుకున్నారు. అటు నుంచి హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. హెలిపాడు వద్ద సీఎం కేసీఆర్‌కు పలువురు ఏపీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.పెండ్లి వేదిక దగ్గరకు చేరుకున్న కేసీఆర్ నూతన వధూవరులు శ్రీరామ్, జ్ఞానలను పుష్పగుచ్చం అందించి ఆశీర్వదించారు. సీఎంతో పాటు మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహం నిమిత్తం వెంకటాపురం వచ్చిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తమ మాజీ సహచరుడు, దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి సమాధిని సందర్శించి , పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. పూర్వం టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్, తుమ్మల, ఎర్రబెల్లికి పరిటాల రవితో మంచి అనుబంధం ఉంది..ఈ మేరకు ఏపీ మంత్రి పరిటాల సునీత ఆహ్వానించగానే కాదనకుండా శ్రీరామ్ పెండ్లికి హాజరై తన పెద్దరికాన్ని చాటుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ సీఎం కేసీఆర్ రాకతో అనంతపురం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో శ్రీరామ్- జ్ఞాన వివాహ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ తన తిరుగు ప్రయాణంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో ఐదు నిమిషాల పాటు ఏకాంత సంభాషణ జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు, తెదేపా వ్యూహాలపై పయ్యావుల వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సంభాషణలో తెలంగాణ రాజకీయాల పైనా ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.