విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక నేతలు లెంక అప్పలనాయుడు, బయిరెడ్డి నాగేశ్వరరావు తదితరులతో కలసి ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు ఇల్లిల్లూ తిరిగారు.
ఈ సందర్భంగా ప్రారంభంలోనే లక్ష్మీదేవిపేట ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. తమకు అభివృద్ధి అక్కర్లేదని, వెంటనే నగర పంచాయతీ నుంచి తమ ప్రాంతాన్ని తప్పించాలని కోరారు. ప్రధాన కూడలిలో సీపీఎం నేత కిల్లంపల్లి రామారావు కూడా ఎమ్మెల్యేను అడ్డగించి నగర పంచాయతీ విషయమై నిలదీశారు. ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని వినతిపత్రం సైతం అందజేశారు. స్థానిక శ్మశానానికి వెళ్లేందుకు సీసీరోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇంత వరకు ఎందుకు పనులు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. మరో వైపు టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పలు చోట్ల వాల్‌పోస్టర్లను అంటించారు.