దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున
రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీ పూజ చేశారు. నాటి నుండి అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులను పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలిన దినం విజయదశమి అని పండితులు చెబుతుంటారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే రోజు రోజుకీ స్త్రీలపై అత్యాచారాలు పెరగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా పూజించాలని, లేనిచో రావణుడిలాగా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని కావున మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది.
