ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు టీడీపీపై తిరుగుబాటు బావుటా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత రావెల టీడీపీ అధిష్టానంపై కుతకుతలాడిపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంపై టీడీపీ వైఖరికి విరుద్థంగా రావెల వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును నేరుగా ఉద్దేశించి కాకపోయినా పార్టీని మాత్రం ఇరకాటంలోకి నెట్టేదే. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల కిశోర్ బాబు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రావెల పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న వార్తలూ వచ్చాయి. అయితే రావెల మాత్రం ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. రావెల పార్టీలో ఉంటూనే టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులను కలగ చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే రావెల, చంద్రబాబుకు పంటికింద రాయిలా మారారు.
ఇక ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆయన వెనకేసుకు రావడం పార్టీ వర్గాలకు నచ్చడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం రావెలపై ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల కురుక్షేత్ర సభను గుంటూరులో నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు రావెల కిశోర్ బాబు వెనకుండి అన్ని అండదండలూ అందించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మందకృష్ణ మాదిగను తన నియోజకవర్గమైన ప్రత్తిపాడుకు రప్పించుకుని మంతనాలు సాగించారు రావెల. సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలకు ఎక్కడో కాలింది. అంతే రావెలపై అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. మంత్రి జవహర్, సీనియర్ నేత వర్ల రామయ్య రావెలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన ఆధ్వర్యంలో జరిగిన…జరుగుతున్న కార్యక్రమాలకు రావెల పవన్ కల్యాణ్ ఫొటోలను కూడా ఫ్లెక్సీల్లో వాడుతున్నారు. రావెల చాలా తెలివిగా రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ తనను సస్పెండ్ చేస్తే సానుభూతి వస్తుందని రావెల భావిస్తున్నారు. అందుకే టీడీపీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను రావెల ఉల్లంఘిస్తున్నా ఏమీ చేయలేకపోతోందని.. దీంతో రావెల మరింత రెచ్చిపోతున్నారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.