ఏపీలో వైసీపీ దూసుకుపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీకి మంచి ఆదరణ లభిస్తుందని తేలింది. ఇప్పటికే ఏపీలో దాదాపు యాభై లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఒక ప్రతిపక్ష పార్టీకి అతి తక్కువ సయమంలో ఇంత పెద్దయెత్తున రెస్పాన్స్ రావడం శుభ పరిణామమే. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత కొంత డీలా పడిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదును చూసి ఉత్సాహంగా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా సభ్యత్వాల పట్ల హ్యాపీగా ఉన్నారు. కేవలం పది రోజుల్లోనే యాభై లక్షల మంది సభ్యులు చేరడంతో జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. సమిష్టి కృషి వల్లే ఈ రిజల్ట్ సాధ్యమైందని.. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా అధికార పార్టీపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత వల్లనే ఇది సాధ్యమయిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైఎస్ కుటుంబం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకుని వారికి అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం రాష్ట్రంలో జరగుతుండటంతో వైసీపీకి ప్రజల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాము కూడా ఊహించలేకపోయాని వైసీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్ర ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ తమకు బూస్ట్ ఇచ్చినట్లయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీకి ఊహించని విధంగా వచ్చిన సభ్యత్వాలను చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్య పోతున్నారు.