రాజస్థాన్ బికనేర్‌లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌లోని రిడ్‌మల్సర్ పురోహిటన్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్‌రోడ్డులో ఖటూశ్యాంమందిర్ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీ వాహనంలోకి బలవంతంగా లాగేశారు. సమీపంలోని గనులప్రాంతంలో వాహనం నడిపిస్తూ, వారిద్దరూ పలుమార్లు అత్యాచారం జరిపినట్లు జైనారాయణ్‌వ్యాస్ కాలనీ(జేఎన్‌వీసీ) పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఇద్దరువ్యక్తులు మరో ఆరుగురిని పిలిపించారనీ, వారు కూడా తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. తర్వాత పలన అనే గ్రామంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారనీ, అక్కడ పలువురు తనపై లైంగిక దాడికి దిగినట్లు పేర్కొన్నారు. 26వ తేదీ తెల్లవారుజామున 4గంటలకు ఎత్తుకెళ్లిన చోటనే వదిలివెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. సదరు ఇద్దరితోపాటు, 21మంది గుర్తుతెలియని అనుమానితులపై 27న పోలీసులుకేసు నమోదుచేశారు. సంఘటనస్థలంలో కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజేంద్రసింగ్ తెలిపారు. బాధితురాలు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారనీ, ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. అనుమానితులను రాజు, సుభాష్‌లుగా గుర్తించామనీ, మహిళ వైద్యపరీక్ష నివేదికకోసం వేచిచూస్తున్నామని జేఎన్‌వీసీ ఠాణా అధికారి హర్జిందర్‌సింగ్ పేర్కొన్నారు. మరింత మందిని పిలిచేందుకు ఉపయోగించిన రెండు ఫోన్‌నంబర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.
