వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో రఫ్పాడిస్తోంది. ఇక జగన్ నెల్లూరు పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయనున్నారు. నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో స్టార్ట్ చేసిన జగన్ పాదయాత్ర… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో బిజీ బిజీగా ఉండగా.. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ తాజాగా ఓ ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అనేక ఆశక్తికర విషయాల పై స్పందించారు.
విజయమ్మ మాట్లాడుతూ.. అసెంబ్లీలో జగన్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పుడు.., జగన్ పై మంత్రులు ఏవేవో ఆరోపణలు చేసినప్పుడు తెలియకుండానే తన కళ్ళ నుండి కన్నీళ్లు వస్తుంటాయని విజయమ్మ ఆవేదన చెందారు. జగన్ మాత్రం ఎన్ని విమర్శలు చేసినా.. ధైర్యంగా వాటికి నిలబడేవాడని చెప్పారు. ఇతర పార్టీ నేతలు తన పై విమర్శలు చేస్తారని.. నిందలు వేస్తారని.. తనకు వ్యతి రేకంగా కుట్రలు చేస్తారని.. అయితే ప్రజలకోసం నిత్యం తపించిన తన తండ్రి వైఎస్ ఆశయం నెరవేర్చాలంటే.. వీటన్నింటినీ తట్టుకోవాలని.. ప్రజలకి సేవ చేయాలంటే అనేక ఆంటంకాలు ఎదురవుతాయని.. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయనని.. తననే సముదాయించేవాడని విజయమ్మ వివరించారు. ఇక ఆనాడు టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కలిసి.. జగన్‌పై కుట్ర పన్ని లేఖలు రాస్తేనే నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జగన్ పై సీబీఐ విచారణకు ఆదేశించారని.. అయితే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికినా.. ఏమీ చేయలేదని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఒక దశలో రాజకీయాలే వద్దని తాను సూచించానన్నారు. అయితే జగన్ మాత్రం న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకుని వెనకుడుగు వేయకుండా ముందుకే వెళ్లాడని విజయమ్మ అన్నారు.