తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ( ఆదివారం ) పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది.
మహిళా, శిశుసంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రయాణాల్లో ఉన్న వారికోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. 787 మొబైల్ బృందాలు, 2,280 రూట్ సూపర్వైజర్లు, 8,711 మంది ఏఎన్ఎంలు, 27,045 మంది ఆశావర్కర్లు, 32,082 మంది అంగన్వాడి వర్కర్లు పోలియో చుక్కల పంపిణీలో పాల్గొననున్నారు. ఆదివారం ఏ కారణం చేతనైనా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే ఆ చిన్నారులకు ఆ తర్వాత రెండురోజులపాటు పోలియో చుక్కలు ఇంటింటికి వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళికలు రూపొందించింది.