సర్కారీ విద్యను మరింత నాణ్యవంతంగా, నైపుణ్యాల మేళవింపు ఉండేలా కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. కార్పొరేట్ స్కూళ్లలో అవలంభించే విధానాలను సర్కారీ స్కూళ్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉత్తీర్ణత పెంచడం, నైపుణ్యాల వృద్ధి కోసం ఈ ఒప్పందాన్ని చేసుకుంది. టీహబ్‌లో రూపొందిన స్టార్టప్ ఇగ్నిఫైతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టార్టప్ విద్యార్థుల్లోని అవగాహన స్థాయిలను పరీక్షిస్తుంది. వారిలో ఏ అంశాల్లో వెనకబాటుతనం ఉందో తెలుసుకొని వాటిని మెరుగుపర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, డాటా సైన్స్ ఉపయోగించుకొని ఈ అవగాహన స్థాయిని పరీక్షిస్తుంది.
అకాడ్స్, జీట్ పేరుతో రెండు ఉత్పత్తులను ఇగ్నిఫై స్టార్టప్ సిద్ధం చేసింది. ఇంటర్ విద్య వరకు ఉన్నవారికి అకాడ్స్ కాగా, జీట్ ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉద్దేశించింది. ఈ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కిరణ్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాలను పాఠశాల వద్దే అధ్యయనం చేసి వాటిని మెరుగుపరుచుకునేందుకు టీచర్లకు మార్గదర్శకం అందిస్తుందని తెలిపారు. మొదటి దశలో 20 కస్తూరిభా పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని అమలు చేస్తున్నామన్నారు. సాంకేతిక ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తపనపడుతున్నారని, టీహబ్‌లో రూపుదిద్దుకున్న స్టార్టప్‌గా తాము విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చామని వివరించారు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గల 4 లక్షల మంది విద్యార్థులు, 28,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఇగ్నిఫై కృషిచేస్తోంది. ఈ సంస్థకు ప్రధాన ఖాతాదారుల్లో శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి.