టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్వయానా బాబాయ్, కృష్ణగారి సోదరుడు.. ఆదిశేషగిరిరావు. రాజకీయంగా వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిశేషగిరిరావు పవన్ పై చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్.. రాజకీయ పరంగా కేతిగాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేతిగాడు అంటే బహుశా ఇప్పటి తరం జనాలకు పెద్దగా తెలీదేమో గానీ… అప్పట్లో ఫేమస్ అయిన తోలుబొమ్మలాటలో ఇది ఒక హాస్య పాత్ర. సినిమా భాషలో చెప్పాలంటే, కథ మధ్యలో రిలీఫ్ ఇచ్చే కమెడియన్ పాత్ర అని… ప్రస్తుత రాజకీయాల్లో పవన్ పాత్ర అదే అని మండిపడ్డారు.
పోలిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్క – ఈ మూడు పాత్రల మధ్య కథ రసపట్టు లో ఉన్నపుడు, కేతిగాడు పాత్ర ప్రవేశించి, కాసేపు వినోదాన్ని పంచి వెళ్ళిపోతోంది. తోలుబొమ్మలాటలో ఈ పాత్రకి ప్రాధాన్యమున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాత్రకి విశేషాదరణ ఉన్నప్పటికీ, రాజకీయ విమర్శలకి వచ్చేసరికి అతను ఒక బఫూన్ అనే పదానికి సరిసమానమైన పదంగా మన రాజకీయ నాయకులు ఈ కేతిగాడు అనే పదాన్ని వాడుతుంటారు. ఇప్పుడు ఈ పదాన్ని పవన్ కళ్యాణ్ కి ఆపాదిస్తూ.. ఆదిశేషగిరిరావు విమర్శలు చేసారు.
ఇక జనసేన పార్టీ ఒక కామెడీ ఎపిసోడ్ అనీ, పవన్ ఒక కేతిగాడనీ, మధ్య మధ్యలో వచ్చి పోతుంటాడనీ, ఈయన బయటికి రావాలంటే చంద్రబాబు బటన్ నొక్కాలనీ, సమస్య మొత్తం అయిపోయాక అప్పుడు వచ్చి పవన్ స్పందిస్తూంటాడనీ, సకాలం లో పవన్ ఎప్పుడూ స్పందించడనీ ఈయన అన్నారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో 125 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని, 2019లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని.. అన్నారు. ఇక మహేష్ బాబు మాత్రం రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడని మరొక సారి క్లారిటీ ఇచ్చాడు.