ఎవరు ఔనన్నా, కాదన్నాతెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు .సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు ఇవాళ భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ వరం అని అన్నారు.
సీలింగ్ భూములు, మొఖస మీద ఉన్న వారికి ప్రభుత్వం పక్షాన పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.ఎస్సాఆర్ ఎస్పీ నిండినా, నిండక పోయినా, వరద వచ్చినా, రాకపోయినా కాళేశ్వరం ద్వారా వరదాకాలువ ప్రాజెక్టు ఒక్క ఏడాదిలోనే జీవకాలువగా మారనుందన్నారు.1.4 టీఎంసీ వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇండ్లు మునిగితే, ఇప్పడు 9 టీఎంసీలకు పెంచినా అదనంగా మునుగుతున్న ఇండ్లు 150 మాత్రమేనని చెప్పారు.ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రాజెక్టులు కట్టలేదని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ట్టు హరీశ్ తెలిపారు. ఇప్పటికే 75 శాతం పూర్తయిందన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని నీళ్ల మంత్రి హరీశ్ భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ సర్కారు హయాంలో ఎకరాకు 2 లక్షలు ఇస్తే, తమ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు దాదాపు 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.గౌరవెల్లి పాత జలాశయ ముంపు పరిధిలో 687 ఆవాసాలు ముంపునకు గురవుతుండగా వాటిలో 681 ఆవాసాలకు రూ.82.34కోట్ల పరిహారాన్ని చెల్లించారు.పాత ముంపు ప్రాంతాల పరిధిలోని సామాజిక ఆర్థిక మదింపు చేయగా ప్రాజెక్టు ప్రాంతం నుంచి 937 కుటుంబాలను గుర్తించారు. వారంతా వేర్వేరు ప్రాంతాలలో వ్యవసాయానికి, స్థిర నివాసం ఏర్పాటు కోసం ఆర్థిక తోడ్పాటు కావాలని కోరారు. పునరావాస కాలనీకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు భూనిర్వాసితులతో చర్చలు జరిపి కుటుంబానికి రూ.8లక్షల చొప్పున పునరావాస ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం చెల్లించింది.ఇందులో భాగంగా 707 నిర్వాసిత కుటుంబాలలో 553 కుటుంబాలకు రూ.44.24కోట్లను చెల్లించారు.ఈ కార్యక్రమంలోఎంపీ వినోద్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ , మాజీ ఎం.ఎల్.ఏ.చాడా వెంకటరెడ్డి, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.