వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు బ్రహ్మరథంపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ ఇలా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
అయితే, వందల కొద్దీ ప్రయాణం.. లెక్కలేనన్ని ప్రజా సమస్యలు.. మరెన్నో మరుపురాని సంఘటనలు.. అడుగడుగునా.. ఏ మాత్రం తగ్గని అభిమానం వైఎస్ జగన్ సొంతం అని చెప్పొచ్చు. సమస్యల పరిష్కారానికి నేనున్నానంటూ ప్రజల్లో బరోసా కల్పించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగకుండా, రైతు రాజ్యం, ప్రజా సంక్షేమం, రాజన్న రాజ్యం తీసుకు రావడమే లక్ష్యంగా జగన్ తన పాదయాత్రను ప్రజల మధ్యన ఎంతో ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
ప్రతీ రోజు చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తూ పాదయాత్ర చేస్తూ.. మధ్య మధ్యలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ.. అలుపెరగకుండా సభల్లో మాట్లాడుతూ..రాత్రికి విశ్రాంతి తీసుకుని.. ప్రొద్దున్నే లేచి రెడీ అయిన తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తూ.. అరెరే ఇవాళే మొదటి రోజు పాదయాత్ర చేస్తున్నాడా అనేలా ఉన్న జగన్ ఉత్సాహం రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా ముగించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏఏ ఆహార పదార్థాలు, ఎలాంటి పానియాలు తీసుకోవాలి అనేదానిపై ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్రను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు జగన్. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న సంకల్పమే జగన్ ఉత్సాహానికి కారణమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఏదేమైనా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆశిద్దాం.