దేశంలో మిగులు విద్యుత్ ఉన్నందునే తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వాస్తవాలు పరిశీలించేందుకు ఉత్తమ్ రావాలని కోరారు. దేశంలో చాలినంత విద్యుత్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం 2018 డైరీని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. కాంగ్రెస్ హయంలో పరిశ్రమలకు మూడు రోజుల పాటు పవర్ హాలీడే ప్రకటిస్తే.. తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తోందని హరీష్ రావు చెప్పారు. 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో పగలు 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కనీసం 3 గంటల పాటు విద్యుత్ ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. దిల్లీలోని భాజపా నేతలు కూడా రాష్ట్రంలో తెరాస పాలనను మెచ్చుకుంటుంటే.. తెలంగాణలోని భాజపా నేతలు ఆగమవుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.