తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీపై ఇతర పార్టీలకు చెందిన విమర్శకులకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సూపర్ క్లారిటీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్‌తో సంబంధాల విషయంలో స్పష్టంగా స్పందించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారని పలువురు విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్ట్ ప్రస్తావించగా…వారసత్వంపై మాట్లాడుతున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ వారసులు జైలుకు వెళ్లారన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు ఎన్నికలలో గెలిచారని చెప్పారు. ఈ విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలన్నారు.
ఢిల్లీ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబమని..దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో సిస్టంను ప్రవేశ పెట్టామన్నారు. దీంతో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని పర్మిషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ అన్నారు. దీనికి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు.