ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను కడతేర్చే సంఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొమ్మిదికి పైగా అక్రమ సంబంధాల కోసం భార్యలు భర్తలను కడతేర్చేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. ఈ తొమ్మిది ఘటనలు కూడా కేవలం వెలుగు చూసినవే. వెలుగు చూడని ఘటనలు, కుటుంబ పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన సంఘటనలు మరెన్నో. అయితే, వెలుగు చూసిన తొమ్మిది ఘటనల్లో నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వాతి ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే, వీళ్లందరికీ భిన్నంగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ తనపై రేప్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి తనను అడ్రస్ అడిగేందుకని వచ్చి కారులోకి లాక్కెళ్లాడని, ఆ కారులో ఓ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, కారును రోజంతా నగరం చుట్టూ తిప్పుతూ తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొంది. దీంతో మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఆ మహిళ అసలు గుట్టు బయటపడింది.
అసలు, ఆ మహిళపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ మహిళ ఇలా ఫిర్యాదు ఇవ్వడానికి గల కారణం ఏమిటా..? అని ఆరా తీయగా.. తనకు తన భర్త అంటే ఇష్టం లేదని, పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. దీంతో తనకు ఇష్టంలేని వ్యక్తితో.. తమ పెద్దలు పెళ్లిచేశారని చెప్పుకొచ్చింది. ఆ మహిళ చెప్పిన మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు.