కాంగ్రెస్ రెబల్ నేతలుగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు పెంచుతూ వచ్చారు. అయితే ఉత్తమ్‌కుమార్ రెడ్డినే తిరిగి టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో జిల్లాలో వర్గ విబేధాలకు స్వస్తి చెప్పి సర్దుకుపోదాం అనే ధోరణిలో నేతలు ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. కాలు దువ్వడం వదిలేసి…కామ్ అయిపోయారని అంటున్నారు.నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తమ వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకునే రీతిలో ర్యాలీ లు, సభలు, సమావేశాలు నిర్వహించారు.
హఠాత్తు నిర్ణయాలతో విపక్షాన్ని, స్వపక్షాన్ని విమర్శలతో ఇరుకున పెడుతూ వచ్చారు. కొంతకాలం కోమటిరెడడ్ఇ బ్రదర్స్ టీఆర్‌ఎస్‌లోకి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆపై అమిత్‌షా జిల్లా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరిక ఖాయమని రాజకీయ చర్చలు సాగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాపై మాటల ఈటెలు విసిరినప్పుడు బ్రదర్స్ పార్టీ మారడం తధ్యం అనుకున్నారు. నకిరేకల్, మునుగోడు, దేవరకొండ మూడు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్దులను గెలిపిస్తామనే సంకేతాన్ని చాటారు.
ఇటీవల మనుగోడు నియోజకవర్గం చండూర్‌లో పార్టీ పెద్దనేతలను ఆహ్వనించకుండా రాజగోపాల్‌రెడ్డి రాహుల్‌గాంధీ అభినందన సభను మండల స్థాయి నేతలు, కార్యకర్తలతోనే నిర్వహించారు. ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకే అన్ని తానై సభ నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ పాలనా పగ్గాలు మారుతాయని ఆశించి భంగపడిన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుతం శాంతి వచనాలు పలుకుతున్నారు. కాగ్రెస్ గెలుపు గీతం పాడుతున్నారు. తమ నియోజకవర్గాలే కాకుండా 10 నియోజకవర్గాలు తమకు అప్పగిస్తే గెలిపించి తెలంగాణా ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుంటామని ప్రకటిస్తున్నారు. కాలు దువ్వే పరిస్థితి లేకపోవడంతో…కామ్ అయిపోయారని అందుకే సఖ్యత మంత్రం జపిస్తున్నారని అంటున్నారు.