తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తుమ్మిళ్లకు నెలనెలా వచ్చి.. ఆర్నెల్లలోగా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయనున్నట్టు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆయకట్టుకు జీవం పోసే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మిళ్ల వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్డీఎస్ కోసం గతంలో కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనడానికి ఆర్డీఎస్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్, ఆర్డీఎస్ చెరో సగం చొప్పున నీటిని వాడుకోవాలని అన్నారు. ఆర్డీఎస్‌కు 65 టీఎంసీలు రావాల్సి ఉంటే ఒక్కక్కోసారి 5టీఎంసీలు కూడా రావడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఆర్డీఎస్‌ను పూర్తిచేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వారి హయాంలో 90శాతం నిధులు ఖర్చు చేసి 50శాతం పనులు మాత్రమే చేసిందని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ ప్రాజెక్టు సాకారమయ్యేది కాదన్నారు. ఇవాళ శంకుస్థాపన జరుపుకొన్న తుమ్మిళ్ల ప్రాజెక్టు వచ్చే వానా కాలానికి ప్రారంభం కావాలన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులను పర్యవేక్షించి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. వానా కాలం నుంచే రైతులకు ఎకరాకు రూ.8వేలు పెట్టుబడి ఇస్తున్నాం. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.ప్రతి ఎకరానికి 8 వేల రూపాయలు ఎలా ఇవ్వాలి?చెక్కు,లేదా నగదు ఇవ్వాలని రైతులు మెజారిటీ అభిప్రాయ పడుతున్నారు.రైతులు కొరినట్లే ఇస్తాంమన్నారు .