రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్ధతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.ప్రగతి భవన్ లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ హరీష్ రావు, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఈటెల రాజేందర్, శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీ జోగు రామన్న, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి, విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండిసి చైర్మన్ శ్రీ సుభాష్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ శ్రీ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..
రైతులు పండించిన పంటలకు మార్కెట్ లో మద్ధతు ధర రాకుంటే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధానం తీసుకురావాలని అధికారులకు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్షం చేశారని, అందువల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, చెరువులు పునరుద్ధరించామని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఎరువులు/విత్తనాల కొరత లేకుండా చేశామని, గోదాములు నిర్మించామని, ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల పెట్టుబడిని ఈ ఏడాది నుంచే అందిస్తున్నామని, ప్రతీ 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, రైతులను సంఘటిత శక్తిగా మార్చామని, వ్యవసాయ యూనివర్సిటీని బలోపేతం చేశామని, భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వ్యవసాయ భూముల యాజమాన్య విషయంలో స్పష్టత వచ్చిందని, ఈ చర్యలతో పాటు రైతులకు పండించిన పంటకు మద్ధతు ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తుందన్నారు.
‘‘రైతులు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా వుంటుంది. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అందుకే రైతులు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’ అన్నారు.