పదవులు లేని..ప్రజలు దూరం పెట్టిన రాజకీయ పార్టీల వల్లే గిరిజనులు ఆదివాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం 11 వ వార్షికోత్సవ మహా సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభ ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగించారు. 11 సంవత్సరాలు ఒక విద్యార్థి సంఘం నడపడం గొప్ప విషయమని అన్నారు. సంఘాలు నడపడం చాలా కష్టమని… తెలంగాణ ఉద్యమంలో పుట్టిన టీజీవీఎస్ ఇంత ఎత్తుకు ఎదగడం ఆనందంగా ఉందని కొనియాడారు.
`సంఘాలు హక్కుల కోసం పోరాటం చేస్తాయి.. పేద విద్యార్థులకు చదువుకుంటు,హక్కుల కోసం పోరాటం చేసే గుణం ఉంటాయి. నెహ్రు నాయక్ వాళ్ల చిన్న పిల్లలతో యూనివర్సిటీ లో తెలంగాణ ఉద్యమం చేశాడు. ఉద్యమాల్లో హోదాలు ఉండవు.. వెంకటేష్ చౌహన్, నెహ్రు నాయక్ ఎట్లనో ఈటెల రాజేందర్ .అందరు ఒక్కటే. తండాలలో పుట్టిందే కళ్యాణ లక్ష్మి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు…గ్రామ పంచాయతీలుగా మారిన తండాలలో జరుపుకుంటాం` అని మంత్రి ఈటల తెలిపారు. `జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తాం. పదవులు లేని కొన్ని పార్టీలు జాతుల మధ్య గొడవలు పెడుతున్నాయి.` అని అన్నారు. ఉద్యమకారులను కాపాడుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు నెహ్రునాయక్ మాట్లాడుతూ హాస్టల్లలో సన్నబియ్యంతో భోజనం పెట్టేందుకు మంత్రి ఈటల రాజేందర్ కారణమని అన్నారు. `ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఉద్యమంలో పాల్గొన్న గిరిజన విద్యార్థులకు రాజకీయాలలో అవకాశం కల్పించాలి` అని కోరారు.