ఇటీవల జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీలో ఏపీ వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వాగ్దదానాలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు” అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ విధంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను ఆదుకుంటాం, తక్కువ వడ్డీకే రుణాలు, నూలుపై సబ్సిడీ చెల్లిస్తాం అని తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఫింఛన్ వెయ్యి నుంచి రూ.2 వేలు అందజేస్తామన్నారు.
చేనేత కుటుంబాలకు అతి తక్కువ వడ్డికే రుణాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ చేనేత కుటుంబాలకు రుణాలు అందడం లేదన్నారు. చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఏ జిల్లాలో కూడా చేనేత పార్కు కనిపించలేదన్నారు. చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి. ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బట్టలకు మాత్రం ధర లేదని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా ఉంటా. ఆరోగ్యశ్రీని పునరుద్దరణ చేస్తాం. హైదరాబాద్ లోనూ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. పేదవాళ్లకు ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందజేస్తాం అని జగన్ అన్నారు. అంతేగాక విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ప్రతి ఏటా 20వేలు మెస్ ఛార్జీలు చెల్లిస్తాం అని తెలిపారు. అదికారంలోకి రాగనే ఈ వాగ్దానాలను అమలు చేస్తే తేలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జగన్ నిలిచిపోతాడని స్థానిక ప్రజలు అంటున్నారు.