వ్యవసాయమే జీవనాధరమైన తెలంగాణ ప్రాంత ప్రజానికానికి ఆ కష్టాలు తెలిసిన వ్యక్తి అయిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం గొప్ప వరమని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో చితికిన తెలంగాణ రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశచరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ ఉమ్మడి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని లొంక కేసారం గ్రామంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు చేపట్టిన మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ రంగానికి నిరంతంరంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్న ఫీడర్‌ను ఆన్ చేశారు.
ఈ సందర్బంగా కల్వచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరెంట్ కోతలు, రాత్రి వేళ విద్యుత్ సరఫరాల వల్ల రైతుల ఈవనాధారమైన పంటల కోసం అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాత్రి వేళల్లో పొలానికి నీరు కట్టేందుక వెళ్లిన ఎందరో రైతులు కరెంట్ షాక్‌లతో, విష పురుగుల కాటుకు బలియై, కరెంట్ కోతలతో పంటలు సక్రమంగా పండించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడి మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. స్వరాష్ట్ర తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే దృడ సంకల్ఫంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఓ బృహత్తర నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమేనన్నారు. రాత్రి వేళ ప్రమాదాలను నివారించడంతో పాటు రైతులకు కరెంట్ కష్టాలు దూరం చేయడమే ఈ నిర్ణయానికి కారణమన్నారు.
వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల రాత్రి వేళల్లో పొలాల వద్దకు రైతులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని మంత్రి అన్నారు. దీంతో ప్రమాధాల బారిన పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిని తెలంగాణ వ్యాప్తాంగా పారించి పల్లె పల్లెన సిరుల పంటను పండించాలనే ఓ మహాత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడు లేని విధంగా మహా ప్రాజెక్ట్‌ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
2018 జూన్ నాటికి తుపాకుల గూడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి మొదటి దఫాలో ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేయనున్నారన్నారు. అలాగే త్వరితగతిన తెలంగాణలోని మిగితా జిల్లాలను కూడ సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు. ఈ గోదావరి ప్రాజెక్ట్‌ల ద్వారా నీటిని వరదకాలువకు సరఫరా చేసి తద్వారా వివిధ ప్రాంతాలకు సాగు నీటిని సరఫరా చేసి సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పల్లెపల్లెన ఇంటింటికి నిరంతరంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, అలాగే ఇకపై వ్యవసాయ రంగానికి కూడ నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు.