ఫేస్బుక్. నేటి ప్రపంచంలో ఫేస్బుక్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి కాదు. మార్క్ జుకర్‌బర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను తయారు చేశాడోగానీ.. మనిషి దైనందనీయ జీవితంలో భాగమైపోయింది ఫేస్బుక్. అందుకు కారణం కూడా లేక పోలేదు. ఫేస్బుక్ అకౌంట్‌ను ఎవరైనా.. ఎక్కడైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సులభతరమైన విధానాలతో ఫేస్బుక్ అందరికి అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషించారు. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసేలా.. ఒకరితో మరొకరు అనుసంధానం అయ్యేలా తన పరిధిని విస్తృత పరుచుకుంది ఫేస్బుక్.
అయితే, ఫేస్బుక్ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో… అంతే స్థాయిలో నష్టపరుస్తుందన్న విషయం వాస్తవమేనని చెప్పక తప్పదు. ఒకరి పేరుతో మరొకరు.. వేరొకరి ఫోటోను, అసభ్యకర సన్నివేశాలు, అసభ్యకర చిత్రాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే ఆకతాయిలతో కొంతమందికి వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. అందుకు కారణం నకిలీ ఫేస్బుక్ అకౌంట్సే. అయితే, నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు ఆ సంస్థ ఎన్నో ఫీచర్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆవేవీ అంతగా సత్ఫలితాలను ఇవ్వలేదు.
అందులో భాగంగానే ఫేస్బుక్ యాజమాన్యం మరో విన్నూత్న ప్రయోగానికి తెరతీసింది. అదే ఆధార్ కార్డు లింగ్. ఇప్పటికే మన దేశంలో ఏ ప్రభుత్వ పరంగా ఏ చిన్న పని కోసమనా ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. ఈ లింక్‌తో మన పూర్తి వివరాలు వెంటనే వారికి లభిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే పంథాను ఫేస్బుక్ యాజమాన్యం అమలుపరిచేందుకు సిద్ధమైంది. ఆధార్ లింక్‌తో నకిలీ ఖాతాదారులను నియంత్రించవచ్చని, అలాగే, ఎవరు, ఎలాంటి పోస్టింగ్స్, వార్తలు, గాసిప్స్ పెడుతున్నారు, అంతేగాక తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిని గుర్తించడంలో ఈ విధానం ఉపయోగపడుతుండట. ఈ విధానాన్ని త్వరలోనే అమలు పరచనున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం తెలిపింది.