ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ తమ అభిమానాన్ని చాటారు.
ఎన్ ఆర్ ఐ ,వైసీపీ కన్వీనర్ రమణారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి మహానేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిఆశయసాధనకై కృషి చేయాలనీ పిలుపునిచ్చారు, యువనేత జగన్ గారి పోరాట పటిమను కొనియాడారు. ఈ సందర్బంగా సతీష్ పాటి గారు మాట్లాడుతూ రైతుల కోసం మరియు బడుగు బలహీన వర్గాల హితం కోసం నాడు వై ఎస్ ఆర్ గారు ప్రవేశపెట్టిన వివిధ పథకాలను మరియు వాటి ద్వారా జరిగిన లబ్దిని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టి డి పి కి వచ్చే ఎలక్షన్లలో తగిన బుద్ది చెప్పి, ప్రజా సంక్షేమం మరచిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలనీ, అందుకు తమ సభ్యులంతా నడుం బిగించి తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు.
తమ పూర్తి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, దివంగత నేత వై ఎస్ ఆర్ గారి బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు. కన్వినర్ కౌశిక్ మామిడి మాట్లాడుతూ అధికార టి డి పి అసమర్థతను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు.కేక్ కట్ చేసి సభ్యులంతా ఒకరికొరకు శుభాకాంక్షలు తెలుపుకొంటూ జై జగన్ మరియు వై ఎస్ ఆర్ అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో విక్టోరియా స్టేట్ యూత్ వింగ్ కన్వినర్ లోకేష్ కాసు, సోషల్ మీడియా ఇంచార్జి రమ్య యార్లగడ్డ, నాయకులు సుబ్బారెడ్డి, పవన్ గోగుల,ఆస్ట్రేలియాలోని వివిధ సంఘాల నాయకులు వెంకట్ నూకల, ఆదిరెడ్డి యారా, ప్రవీణ్ దేశం, కిరణ్ పాల్వాయి, అమరేందర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.