రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్ అనే యువకుడు గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాలాపేటలో సంధ్యారాణి మృతదేహానికి నివాళులర్పించి సంధ్యారాణి కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.అకౌంటెంట్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయ పడుతున్న సంధ్యారాణి మృతి చెందడంతో… ఆమె కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా మంత్రి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. సంధ్యారాణి కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. సంధ్యారాణి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ గస్తీ పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.
