ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు బాధిత మహిళ కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా మంత్రులు స్పందించట్లేదని మండిపడ్డారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అంటూ చిత్తూరులో రోజా మాట్లాడుతూ.. మండిపడ్డారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా మాట్లాడారు. పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మహిళను వివస్త్రను చేసింది స్థానిక నాయకులు రాజు, శ్రీను అని ప్రచారం సాగుతోంది.