తెలంగాణ సోయగాలు వెతికినకొద్దీ కనిపిస్తూనే ఉంటాయి! వేల సంవత్సరాల క్రితపు ఆశ్చర్యకర సంగతులు కొత్తగా పలుకరిస్తూనే ఉంటాయి! భూపాలపల్లి జిల్లాలో మొన్నటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని బొగత జలపాతం ఒక రమణీయదృశ్యమైతే.. దానిని తలదన్నే రీతిలో అదే జిల్లాలో మరో కమనీయ దృశ్యంగా నిలుస్తున్నది.. దాదాపు ఏడు వందల అడుగుల ఎత్తునుంచి దుంకుతున్న గద్దలసరి జలపాతం!! దేశంలోనే అతి ఎత్తయిన జలపాతాల సరసన నిలిచే ఈ ప్రకృతి అద్భుతం దిగువ భాగాన ఉన్న అతిప్రాచీన కట్టడాలు ఆదిమానవులు నడయాడిన జాడలను వెతికి చూపుతుండటం మరో విశేషం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ ఆ విశేషాలను వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిని రొయ్యూరు-పూసూరు మధ్యనున్న వంతెను దాటి చర్ల వైపు 28 కిలోమీటర్లు ప్రయాణిస్తే మార్గమధ్యంలో రామచంద్రాపురం గ్రామం వస్తుంది. అక్కడి నుంచి వాయవ్య దిశగా అడవిలోకి 9 కిలోమీటర్లు వెళితే గద్దలసరి గుట్టలు ఉన్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుగా ఉన్న ఆ గుట్టల పైనుంచి ఒక కొండవాగు జలపాతమై కిందికి దుంకుతుంటుంది. ఆకాశంలో గద్దలు ఎగిరేంత ఎత్తున ఉండటంతో దీనికి గద్దలసరి జలపాతం అనే పేరు వచ్చింది. అడవిలోపల ఉండటం, గతంలో నక్సలైట్లు సంచరించిన కారణంగా ఇది బయటి ప్రపంచానికి తెలియరాలేదు. కర్ణాటకలోని జోగ్ జలపాతంస్థాయిలో ఉన్న ఇది ఒక గుండంలో దూకి, ఓ వంద మీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక మలుపు తీసుకుంటుంది. అక్కడ ఆదిమానవులు కట్టుకున్న అరుగులు, ఆనకట్టలు ఉన్నాయి. వీటి సమీపంలో పెచ్చులు, బ్లేడులు వంటి రాతి ఆయుధాలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి.
ఈ నీటి వనరు ఆసరాగా ఆదిమానవులు ఇక్కడ చరిత్ర పూర్వయుగం నుంచి నివసించారని చెప్పవచ్చునని ద్యావనపల్లి పేర్కొన్నారు. ఆదిమానవులు బంకమట్టి, గులకరాళ్లతో అరుగులు చేసుకుని, వేటాడిన జంతువుల మాంసాన్ని కోసుకోవడానికి రాతి ఆయుధాలు వాడుకునేవారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఎండాకాలంలో నీటిని నిలుపుకొనేందుకు ఆనకట్ట కట్టి ఉంటారని చెప్పారు. గద్దలసరి వద్ద ఉన్న ప్రాచీన కట్టడాల వంటివాటిని నాలుగు దశాబ్దాల క్రితం ఠాకూర్ రాజారాంసింగ్ అనే పరిశోధకుడు నిర్మల్ జిల్లా వాంకిడి-ఘన్‌పూర్ జలపాతం దగ్గర, గద్దలసరికి ఎదురుగా గోదావరి కుడి ఒడ్డున ఉన్న సెలిబాక దగ్గర కనుగొన్నారని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రదేశాలు చర్ల స మీప ప్రాంతాల్లో ఉండి ఉంటాయని ఆయన భావించారని, ఈ క్రమంలో నే తాను గద్దలసరి జలపాతాన్ని సందర్శించారని తెలిపారు.