తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి ఎల్బీ స్టేడియానికి చేరుకోగానే పండితులు పూర్ణకుంభంతో.. మంగళవాయిద్యాలతో సభావేదిక వద్దకు ఆహ్వానిస్తారు.తెలంగాణ వైభవాన్ని చాటే ముప్పై నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. అనంతరం వేదికపైకి అతిథులను ఆహ్వానిస్తారు.
జాతీయ గీతాలాపనతో తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సరస్వతి స్తోత్రాన్ని నటేశ్వరశర్మ ఆలపిస్తారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. తెలంగాణ తల్లిని పూలమాలతో అలంకరిస్తారు. తర్వాత బమ్మెర పోతన పద్యాల పఠనం ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం అతిథులను సత్కరిస్తారు. మహాసభల్లో పాల్గొంటున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానిస్తారు. అనంతరం ఎన్ గోపి కవితా పఠనం ఉంటుంది. వెంటనే ఎల్బీ స్టేడియం బయట పటాకులు పేల్చుతారు. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వెలిగే పటాకుల కాంతిని ఆహుతులంతా వీక్షించేలా ఏర్పాటు చేశారు. చివరగా జాతీయ గీతాలాపనతో సభను ముగిస్తారు.ప్రపంచ తెలుగు మహాసభల కోసం ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి.. తదితర వేదికలు ముస్తాబయ్యాయి.
తెలంగాణ గుండెనిండా తెలుగు పండుగ.. నినాదంతో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. మహాసభల కోసం 41 దేశాల నుంచి 450 మంది అతిథులు, ప్రతినిధులు తరలి రానున్నారు. ఇక ఇతర రాష్ర్టాల నుంచి 500 మంది హాజరవుతున్నారు. వివిధ హోటళ్లలో రెండువేల మందికి వసతి సదుపాయాలు కల్పించారు.అతిథులకు ఎలాంటి లోటు ఉండకూడదన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 14 శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విమానాశ్రాయాలు, రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటుచేశారు. అతిథులు రాగానే సమాచార కేంద్రం సహాయంతో బసకు చేరుకుంటారు. ప్రతీ చోట టోపీ, టీ షర్ట్ ధరించిన స్వచ్ఛంద సేవకులు మహాసభల సమాచారంతో సిద్ధంగా ఉంటారు.