ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమెకు తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మాధవ రెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని, ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవ రెడ్డి అని కొనియాడారు. సందీప్‌రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉంది. రాజకీయాల్లో ఎవరికి, ఎప్పుడు, ఏ అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఓపిక తక్కువగా ఉంటోంది. ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి టీఆర్ఎస్లో ఉన్నత అవకాశాలు ఉంటాయని కేసీఆర్ అన్నారు. నల్గొండ బాగా వెనకపడిన జిల్లా.. భువనగిరి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామని… కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని.. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తామని… కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో నీళ్లు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.