జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా మూడు రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగానే వుంటుందంటూ ఎద్దేవా చేశారు.
అలాగే వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ అనడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనేమైనా ప్రత్యక్షంగా చూశారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతితో కొట్టుకుంటుంటే మరి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి అందులో ఎలా కలిపారు… దీనికి ఫలితంగా ఎంత అవినీతి జరిగిందీ అంటూ ప్రశ్నించారు. ఒకరిని విమర్శించే ముందు మీ గురించి ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. పార్టీని స్థాపించడం గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడు స్థాపించారని నిలదీశారు. అవినీతి, అక్రమాల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆయన తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారనీ, ఆయన చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారా అని సందేహాన్ని వ్యక్తం చేశారు.