తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు.
హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో జీవనం సాగించడం కష్టమని సీఎం అన్నారు.మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేక కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రిజర్వ్‌డ్ కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. డ్రైవర్ల నియామకంలో హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తాం. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని అలవెన్సులు పెంచినట్లు సీఎం చెప్పారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు శాశ్వత ఉద్యోగితో సమానంగా అలవెన్సు ఇస్తామని వెల్లడించారు. నగరంలో పనిచేసే హోంగార్డులకు బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామని..18,900 మంది హోంగార్డులకు కోరుకున్న చోట డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.ప్రభుత్వ మహిళా పోలీసులతో సమానంగా మహిళా హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవు ఇవ్వనున్నట్లు తెలిపారు.