ఏపీలో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో పట్టుకోసం, సీట్ల కోసం ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. ఏపీలో అనంతపురం నియోజక వర్గంలో ఎంపీ సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్య పోటీ జరుగుతుందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీటుపై అటు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కుమార్తె కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి కూడా రేసులో ఉండడం విశేషం.
ఇక హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు పురందేశ్వరి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తరచూ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక నందమూరి హరికృష్ణకు పొలిట్‌బ్యూరోలో ఉన్న ప్లేస్‌ను చంద్రబాబు కంటిన్యూ చేయడంతో ఆయన కూడా పొలిటికల్‌గా తిరిగి రీయాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజివీడు అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ హరికృష్ణ.. వచ్చే ఎన్నికల్లో బాబు ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. వాస్తవంగా ఇది టీడీపీకి కంచుకోట. మరి ఈ ప్లేస్‌లో ప్రస్తుతం టీడీపీ తరపున ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పెనుగొండ లేదా పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అటు పురందేశ్వరి బీజేపీ కోటాలో ఇటు హరికృష్ణ టీడీపీ కోటాలో ఇద్దరూ ఇదే సీటుకు పోటీ పడుతుండడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.