తెలంగాణ యాస, భాష, జీవనసౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మహాసభల క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి.బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్షా సమావేశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి నవంబర్ ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆఫ్ లైన్ నమోదు కార్యక్రమం జరిగిందని, 7వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ నమోదు జరిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నమోదు కార్యక్రమంలో 7920 మంది అతిధులు, ప్రతినిధులు విదేశాల నుంచి , ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి నమోదు చేసుకున్నారన్నారు. ఇందులో 40 దేశాల నుంచి 160 మంది ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి 1167 మంది ప్రతినిధులు, తెలంగాణ నుంచి దాదాపుగా 6000 మంది ప్రతినిధులు వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి 37 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 56 మంది అతిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించే అతిధులకే వసతులు, రాకపోకల ఛార్జీలు ఇస్తున్నామని, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. తెలంగాణ నుంచి సభలకు హాజరయ్యే వారికి వసతులు కల్పించడం లేదని, అదేవిధంగా ఆన్ డ్యూటీపై వచ్చే తెలుగు పండితులకు కూడా ఎలాంటి ఛార్జీలు, వసతులు కల్పించకుండా, ఇక్కడ మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభలకు హాజరవుతున్నందుకు వారికి ఆన్ డ్యూటీ వసతి కల్పిస్తున్నామన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా తెలంగాణ వంటకాలు, రచనలు, తెలంగాణ చరిత్ర, చేనేతలు, చేతివృత్తులు, కళా ప్రదర్శనలు, తెలంగాణ ఆలయాలు, నాణాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మహా సభలకు వచ్చే వారికి ఎక్కడెక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో, వేటికి హాజరు కావాలో నిర్ణయించుకునేందుకు వీలుగా ముందుగానే ఐదు రోజుల మహా సభల కార్యక్రమాలను ప్రచురించి అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు.ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించుకుంటున్న సందర్భంగా వీటికి అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వారు, భాషపై అభిమానమున్నవారు, సాహిత్యకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు.
కొంతమంది ఈ సభలను బహిష్కరించారన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరు, వారు అనే తేడా లేకుండా అందరినీ ఆహ్వానిస్తోందని, రానివాళ్లు, రాకూడదనుకున్నవాళ్లు వారి స్వేచ్చకు వారి నిర్ణయం ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి తెలిపారు. ఈ మహాసభలకు విదేశాల్లో ఉన్న తెలుగు రచయితలు, సంగీతకారులు, నృత్యకారులు, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు భాష పండితులు, రచయితలు అందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభలను గొప్పగా నిర్వహిస్తుందన్నారు.ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని, ఎందరో మహానుభావులు వారందరికీ స్వాగతమని, తెలుగు పండగ, తెలంగాణ గుండెల నిండుగా జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ తెలుగు మహా సభల క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, కె. తారకరామారావు, తెలంగాణ గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం వీసి సత్యనారాయణ, సిఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశ్, విద్యాశాఖ స్పెషల్ సి.ఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇతర శాఖల ఉన్నతాధికారులు, మహాసభల నిర్వాహకులు హాజరయ్యారు.