జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు పవన్. అన్ని ప్రధాన పార్టీలను తూర్పారబట్టిన ఆయన తన లక్ష్యం అధికారం కాదనడంతో జనసేన పార్టీ దేనికోసమంటే పగ ప్రతీకారం కోసమే అన్నట్లు సాగుతుందా అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో లాగే ప్రేమ, పగ ప్రతీకారం అనే ఎలిమెంట్ చుట్టూ జనసేన కధ నడిపిస్తారా ఏమిటి పవన్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
