ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం.
గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా రుజువు అయింది. నాలుగు పదుల వయసు కూడా లేని, అధికారం చేతిలో లేని ఒక యువనేత వెనుక ఇంత అభిమానంతో ప్రజలు కదం తొక్కడం అంటే అది మామూలు విషయం కాదు. అతని మీద ఎన్ని కేసులు ఉండనీ గాక, అతడిపై ఎంత తీవ్రస్థాయిలో దుష్ప్రచారం జరగనీగాక, జగన్ పట్ల జనాదరణ చెక్కుచెదరలేదని స్పష్టం అయింది.
ఆరుమాసాల క్రితం జగన్ కు, నేటి జగన్ కు ఊహించని మార్పు కనిపిస్తున్నది. చంద్రబాబును విమర్శించడంతో సరిపెట్టకుండా, సమస్యలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సరళంగా ప్రజలకు సమస్యలను విపులంగా వివరించి ఉత్తేజితులను చెయ్యడంలో జగన్ సఫలం అవుతున్నాడు. గతంలో “నేను ముఖ్యమంత్రిని అయితే” అనే పదాన్ని విస్తృతంగా వాడి విమర్శలు ఎదుర్కొన్న జగన్ నేడు “మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే” అనే ప్రజాస్వామ్యయుత పలుకులు పలకడం మిక్కిలి హర్షణీయం. ఈ పలుకులద్వారా ప్రజల హృదయాలను చూరగొన్నాడు. జగన్ ముఖ్యమంత్రి అయితే నేను అయినట్లే అని ప్రతిఒక్కరూ అనుకునేలా చేస్తుంది ఆ పదప్రయోగం.
ఇక హామీలపరంగా చూసుకుంటే ఈ పదిహేను రోజుల్లో పశువులకు 102 సర్వీస్ ను ప్రవేశ పెడతాను అని జగన్ ప్రకటించడం అత్యంత ముదావహం. ఇంతవరకూ ఈ ఆలోచనే ఎవ్వరికీ రాలేదు అంటే అతిశయోక్తి కాదు. రైతులను ముదావహులను చేసే ఈ సర్వీస్ వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తుంది. మొన్న ఎదో ఊళ్ళో రైతు సమస్యల మీద పెట్టిన చర్చలో జగన్ చేసిన ప్రసంగం జగన్ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రైతు సమస్యలపై దివంగత వైఎస్సార్ కూడా ఇంతటి అద్భుత ప్రసంగాన్ని చెయ్యలేదు. వైసిపి వాళ్లకు బుర్రల్లో ఏమాత్రం గుజ్జు ఉన్నా, ఆ ఉపన్యాసాన్ని ఊరూరా మార్మోగించేవారు. అలాగే అదే సదస్సులో కొందరు రైతులు చేసిన సూచనలు, సలహాలు, పరిష్కారాలు విశ్వవిద్యాలయాల్లో చదివిన శాస్త్రజ్ఞులు కూడా చెయ్యలేరు.
ప్రజాసమస్యలను అంత ఓపికగా వింటున్న జగన్ ను నిజంగా అభినందించాలి. ఈ నెలరోజుల యాత్ర జరిగిన తీరు, జగన్ ప్రసంగాలు వింటే వైసిపి అసెంబ్లీని బహిష్కరించడమే సబబు అని ఎవరైనా భావిస్తే అది వారి తప్పు కాదు. ఎందుకంటే అసెంబ్లీ లో జగన్ ను మాట్లాడనిచ్చే అవకాశం అధికారపక్షం ఇచ్చేది కాదు. ప్రజాస్వామ్య హంతకుడైన వ్యక్తి సభాపతి స్థానంలో ఉన్నంతకాలం జగన్ లాంటి నాయకులు అసెంబ్లీలో కూర్చుని సమయాన్ని వృధా చేసుకోవడం బదులు ఇలా జనం లోకి వెళ్లి చెప్పడమే అత్యుత్తమం. అసెంబ్లీలో జగన్ చెప్పేది చెవిటివానిముందు శంఖం ఊదిన మాదిరే అవుతుంది. ఇలా జనం ముందు చెప్పేది లక్షలాదిమంది చెవులకు ఎక్కుతుంది. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెలివేసినదాకా వైసిపి సభకు హాజరు కాకుండా ఉంటేనే ఉత్తమం.
ఇక జగన్ పాదయాత్రలో జనసందోహం ఇసుమంతైనా తగ్గుతున్న సూచనలు లేవు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ ఇతర రాజకీయపక్షాల కన్ను కుట్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం నుంచి తొలి పదిహేను రోజుల్లో కనిపించినంత తీవ్ర విమర్శలు రెండో పక్షంలో కనిపించలేదు. అయితే జగన్ వెంట కనిపించే జనం అంతా ఓట్లు వేస్తారా అనే సందేహం కలగొచ్చు. వేసినా, వెయ్యక పోయినా జనాన్ని కలుపుకుని పోవడం రాజకీయనాయకుడి కర్తవ్యమ్. ఆ కర్తవ్యాన్ని జగన్ ప్రశంసార్హంగా నిర్వర్తిసున్నాడు.
ఇక పింఛన్ల విషయానికి వస్తే కొన్ని వర్గాలవారికి నలభై అయిదేళ్లకే పింఛన్ ఇస్తానని జగన్ వాగ్దానం చేశారు. ఇదంత సబబుగా లేదు. పల్లెల్లో జీవించేవారు అరవై ఏళ్ళవరకూ ఆరోగ్యంగానే ఉంటున్నారు. కష్టించి పని చేయగలుగుతున్నారు. కనుక అందరికి నలభై అయిదు ఏళ్లకే పింఛన్స్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆరోగ్యం దెబ్బతిన్నవారికి, వికలాంగులకు, పని చెయ్యలేని అశక్తత కలిగినవారికి మాత్రమే ఆ వాగ్దానాన్ని పరిమితం చెయ్యాలి.
ఇక కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జారిపోయారు. అయినా జగన్ లెక్క చెయ్యడం లేదు. సింహం ఎప్పటికీ నక్కలను చూసి భయపడదు. జగన్ దయాలబ్ధంతో పదవులు పొందినవారు సిగ్గూశరం లేకుండా రాళ్ళేసి వెళ్తుంటే వారిని వెంట్రుక ముక్కలతో సమానంగా సంభావించి వదిలెయ్యడమే ధీరోదాత్తుడైన నాయకుడైన వాడి లక్షణం. అలాంటి అల్పులపై జగన్ విమర్శలు ఎక్కుపెట్టకుండా, తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు.
పాదయాత్ర ముగిసేనాటికి జగన్ కు మరింత ప్రజాదరణ పెరుగుతుందని , గతంలో బలహీనంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈసారి బలం పెంచుకుంటున్నామని, అలాగే తెలుగుదేశం, కాంగ్రెస్ లో ఉన్న అనేకమంది సీనియర్ నాయకులు ఎన్నికలముందు వైసిపిలో చేరుతారని, ఎన్నికలనాటికి వాతావరణం మొత్తం మారిపోతుందని మొన్ననే వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈ వ్యాసకర్తతో చెప్పారు.
మొత్తానికి జగన్ చేస్తున్న ఈ ప్రజాసంకల్ప యాత్ర విజయం నుంచి దిగ్విజయప్రస్థానం దిశగా వెళ్తున్నదని చెప్పుకోవచ్చు.
సోర్స్ : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు