ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన కూడా పోటీలో ఉండబోతుందని సంఖేతాలు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ తాను అనంతపురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాజా సమాచారం ఏంటంటే పవన్ తన రూట్ మార్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల్లో ఇన్నర్ టాక్ ప్రకారం పవన్ అనంతపురం జిల్లా నుంచి పోటీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ కంచుకోట నుంచి కూడా పోటీ చేస్తారన్న చర్చలు నడుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పేరు చెపితే టీడీపీకి కంచుకోట అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో అయితే గత ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లలోను టీడీపీ జెండా ఎగిరింది. ఇదిలా ఉంటే టీడీపీకి ముందునుంచి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా నుంచి కూడా పవన్ అసెంబ్లీ బరిలో ఉంటాడని తెలుస్తోంది.
ఇక పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతిలో గెలిచిన చిరంజీవి ఇక్కడ మాత్రం ఓడిపోయారు. దీంతో అన్న ఓడిపోయిన చోటే తాను పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో పవన్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జనసేన వర్గాలు పాలకొల్లులో రెండుమూడుసార్లు సర్వేలు కూడా చేసినట్టు తెలుస్తోంది. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని కూడా సర్వేల్లో తేలిందట. పవన్ కాపు సామాజికవర్గం ఓటర్లు నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్కడ రెండో ప్లేస్‌లో ఉన్న బీసీల్లో బలమైన శెట్టిబలిజ వర్గం ఓటర్లు కూడా బలంగా ఉన్నారు. వీరిలో పవన్ మద్దతుదారులు ఎక్కువ. ఈ క్రమంలోనే పవన్ పాలకొల్లుపై ఆసక్తి కనపరుస్తున్నారు. పవన్ పాలకొల్లు నియోజకవర్గాన్నే ముందు ఆప్షన్‌గా ఎంచుకుని, అనంతపురంను రెండో ఆప్షన్‌గా ఎంచుకుంటారని తెలుస్తోంది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టీడీపీకి భారీ షాక్ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.