తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ భవన్ లో మంగళవారం నుండి ఎంతో ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది .అందులో భాగంగా నేడు బుధవారం గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సదస్సులో భాగంగా మహిళలకు అవకాశాలు, సాధికారతపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న వేళ, ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరన్న ప్రశ్నకు ఆయన చాకచక్యంగా స్పందించారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “మా ప్రభుత్వంలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి పదవులపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలన్న వాదనకు మేము కట్టుబడివున్నాం. మహిళలకు 33 శాతం బిల్లును పార్లమెంట్లో పెడితే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశామని కేటీఆర్ గుర్తు చేశారు” అని ఆయన సమాధానం ఇచ్చారు.