గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్యక్రమం అమలు, లబ్దిదారుల ఎంపిక పై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, ఎమ్మెల్యే లు జాఫర్ హుస్సేన్, బలాల, కౌసర్ మొహినుద్దీన్, మౌజం హుస్సేన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకాంత్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, ఆర్డీఓ లు రవి, సూర్యప్రకాష్, తహసిల్దార్ లు, వివిధ నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల ఇంటి నిర్మాణానికి ఆర్ధికంగా చేయూతను అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది అర్హులకు ఒకొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల లో అర్హులైన వారిని గుర్తించేందుకు విచారణ ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ శనివారం లోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు చేసుకొనే విధంగా ప్రత్యెక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను మంత్రి కోరారు.
పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లో భాగంగా మొదటి విడతలో 11,700 మంది లబ్దిదారుల ఎంపిక, కేటాయింపు ని ఎంతో పారదర్శకంగా నిర్వహించిన అధికారులను మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. 2 వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.