ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరుకు బయల్దేరుతున్న గ్రామీణులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
బాధితుల చేప్పిన సమచారం.. ఆర్.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు సోమవారం కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీనికి 2 తుఫాన్ వాహనాలను మాట్లాడుకున్నారు. అయితే.. వాహనాలు బయల్దేరే సమయానికి కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి.. ‘కొ…ల్లారా మేమొద్దన్నా పాదయాత్రకు వెళ్తార్రా’ అంటూ అదే గ్రామానికి చెందిన సర్పంచ్ సాయికృష్ణ, బోయ రామాంజనేయులు, ముచ్చెంకరెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వాహనాలపై బండరాళ్లతో దాడి చేశారు. డ్రైవర్ నరసింహులును చితక్కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గ్రామస్తులు వారించే ప్రయత్నం చేయగా.. ‘మా విష్ణువర్ధన్‌రెడ్డికి నచ్చని పనులు ఎవరు చేసినా ప్రాణాలతో మిగలరు’ అంటూ హెచ్చరించారు. ఇలా ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై బాధితులు కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాదయాత్రకు వెళ్తే చంపేస్తామని బెదిరించినా, దాడులకు తెగబడినా గ్రామీణులు ఖాతరు చేయలేదు. యాత్రకు భారీగా తరలివెళ్లారు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వగ్రామం ఎదురూరు, ఆయనకు పట్టున్న తొలిశాపురం, ఆర్.కొంతలపాడు, ఆర్.కె.దుద్యాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. దాడి జరిగిన తీరును కొంతలపాడు గ్రామస్తుడు వసంత, డ్రైవర్ నరసింహులు, కోడుమూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మురళీకృష్ణ వివరించారు