జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.
పలు రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన వారికి ప్రతి ఏటా ఐఈబీఎఫ్ అవార్డును ఇవ్వడం పరిపాటి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు పవన్ కల్యాణ్ ని ఎంపిక చేసినట్టు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం ప్రతినిధులు పేర్కొన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
పవన్ కల్యాణ్ ని ఐఈబీఎఫ్ లీడర్ సునీల్ కుమార్ గుప్తా, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కలిశారని చెప్పారు. ఈ పురస్కారాన్ని లండన్ లోని బ్రిటన్ పార్లమెంట్ లో జరగనున్న ఇన్వెస్ట్ ఇన్ న్యూ ఇండియా సభలో పవన్ కు అందజేయనున్నట్టు తెలిపారు.