ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్-2023లో నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికే 5.88 శాతం దిగువకు తగ్గడం గమనార్హం.
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్.. 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను సోమవారం విడుదల చేసింది.ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, సూలుకు వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నది.
2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4తోపాటు 2019-21లో నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక సూచీలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.