Home / EDITORIAL / కాంగేయులా.. కాలకేయులా?

కాంగేయులా.. కాలకేయులా?

అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.కండ్లుండీ చూడలేని వాళ్లను ఏమంటరు? ఇంకేమంటరు.. కాంగ్రెస్‌ వాళ్లు అనే అంటరు. కాంగ్రెస్‌ అనేకంటే ‘స్కాంగ్రెస్‌’ అన్న పదమే ఆ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. కాంగ్రెస్‌ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తుంది. సరే, ప్రస్తుత సందర్భం ఏమంటే.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన స్థానాన్ని పటిష్ఠ పరుచుకోవాలనే కోరికతో ఇటీవల భట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేశారు. వారి అంతర్గత కుమ్ములాటలేమైనా పాడుగాని కానీ, ఈ సందర్భంగా వారొక అన్యాయమైన, కుట్రపూరితమైన వ్యాఖ్య చేశారు.

‘సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల్లో పారుతున్న నీళ్లు, కాళేశ్వరం నీళ్లే అని నిరూపించే దమ్ముందా?’ అని సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ వెనుక అయితే అవగాహనారాహిత్యమైనా ఉండాలి, లేదా ఉద్దేశపూర్వక కుట్రయినా ఉండాలి. తప్పకుండా రెండోదే కారణం.భట్టి గారూ.. బాజాప్తా చెప్తున్నా. నిరూపణకు నేను సిద్ధం, మీరు సిద్ధమా? రండి, సూర్యాపేట జిల్లా కాల్వల్లో పారుతున్నది కాళేశ్వరం నీళ్లే అని మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. ఈ సంవత్సరం కూడా నీళ్లు వదులుతాం. మీరు రండి. కండ్లారా చూడండి.అయ్యా, భట్టి విక్రమార్క గారూ..! సూర్యాపేట జిల్లాలో పదిహేనేండ్లుగా తుమ్మలు మొలిచిన శ్రీరాంసాగర్‌ కాల్వల్లో ఇప్పుడెందుకు నీళ్లు పారుతున్నాయి? కాల్వల్లో ఊటలూరినయా? లేకుంటే మీ కాంగ్రెసోళ్లు ఎక్కడినుంచన్నా మోటకొట్టి పారిస్తున్నరా?

కాంగ్రెస్‌ అనే శనేశ్వరం పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. అదిచూసిన కాంగ్రెస్‌ నాయకుల మతులు గతులు తప్పుతున్నయి.అయ్యా భట్టి విక్రమార్క గారూ… కాళేశ్వరం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలు రెండు. 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడం మొదటిదైతే, వరదకాలువ కింద ఉన్న 18.82 లక్షల ఎకరాలకు పాత ఆయకట్టును స్థిరీకరించడం రెండవది. వీటితోపాటు వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న మరో 16.83 లక్షల ఎకరాల ఆయకట్టుకూ సాగునీటి భద్రత లభిస్తుంది.

శ్రీరాంసాగర్‌ పాతదే. కాల్వలూ పాతవే. అవి దశాబ్దాల తరబడి నీళ్లు పారని కాల్వలుగానే ఉండిపోయినయి. దానికి కారణం మీ దారుణ వైఫల్యం. దానిగురించి మీరు మాట్లాడరు. ఎస్సారెస్పీ కాల్వల్లో తుమ్మలు మొలిచి పనికిరాకుండా పోతే.. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సూర్యాపేట ప్రజలు ఆ కాల్వల్లో నిరసన సభ పెట్టారనే సత్యాన్ని తమరు సౌకర్యవంతంగా విస్మరిస్తారు. కానీ ప్రజలు మరిచిపోరు కదా?

తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్‌ పలుమార్లు పదవీత్యాగాలు చేసి, నిరాహార దీక్షకు దిగి పద్నాలుగేండ్లపాటు ఉద్యమించి మీ అధిష్ఠానాన్ని గడగడలాడిస్తే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచే కర్తవ్యాన్ని ఒక తపస్సులా చేపట్టారు. గోదావరి జలాల వినియోగానికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రతో మీ నిర్వాకం వల్ల ఏర్పడిన వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించారు. తెలంగాణ అవసరాలకు తగినవిధంగా ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ చేసి అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. నాడు మీ పార్టీని చర్చకు రమ్మం టే.. మీ పార్టీ అధ్యక్షుడు ‘మేం ప్రిపేరై రాలేదు, ఎలా మాట్లాడగలం?’ అని వెన్నుచూపి పారిపోయిన సంగతిని కూడా ప్రజలు ఇంకా మరిచిపోలేదు. గుర్తొచ్చినప్పుడల్లా మీ పార్టీ అజ్ఞానాన్ని తలుచుకొని నవ్వుకుంటారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం కేసీఆర్‌ గారు యుద్ధ ప్రాతిపదికన ఒక పవిత్ర యజ్ఞంలా నిర్వహించారు. రాత్రింబవళ్లూ కార్మికులు, ఇంజినీర్లు శ్రమిస్తుంటే ముఖ్యమంత్రి గారు సైతం ఆతృతతో నిరంతరం పర్యవేక్షించారు. మానవ నిర్మిత మహాద్భుతం ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్ల స్వల్ప వ్యవధిలో పూర్తిచేసి రికార్డు సృష్టించారు.

ఎంత పట్టుదల ఉంటే ఈ కార్యం సిద్ధించింది? ఎన్ని శాఖలను, ఎన్నిరకాల పనులను సమన్వయం చేస్తే ఈ ప్రాజెక్టు రూపుదాల్చింది? రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలని ఎంత తపన ఉంటే ఇంతవేగంగా ఫలితాలు అనుభవంలోకి వచ్చాయి? ఇవేవీ మీరు ఆలోచించరు. మీకు కావాల్సింది, మీ రాజకీయ పబ్బం గడుపుకోవ డం. మీ హయాంలో మీరు చేయలేదు. మా హయాం లో మేం చేసి చూపిస్తే, ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కాం గ్రెస్‌ పార్టీ వాళ్లు ఈ రకమైన వ్యాఖ్యలకు ఒడిగడుతున్నా రు. ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ రెండవ దశ కాల్వల పనుల్లో మీ ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన పనులను బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పూర్తిచేసింది. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వా రా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేరుకు ఎత్తిపోస్తున్నాం. ఆ నీళ్లు లోయర్‌ మానేరు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వల్లోకి చేరి పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో పొలాలు తడుపుతూ సూర్యాపేట టెయిల్‌ ఎండ్‌ చివరి భూముల దాకా అందుతున్నాయి. ఇవాళ రైతుల సాగునీటి అవసరాలు తీరుతున్నాయి.

తెలంగాణ తొలి ఇరిగేషన్‌ మంత్రిగా నాడు నేను ‘ఎస్సారెస్పీ కాకతీయ కాల్వల పరిధిలోని జిల్లాల రైతులే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం చవిచూస్తారు’ అని చెప్పినపుడు మీ పార్టీ నాయకులు నన్ను అడ్డగోలుగా వి మర్శించారు. ‘పెద్దపల్లికీ తొలి ఫలితం అంటాడు, సూ ర్యాపేటకూ తొలి ఫలితం అంటాడు. ఇదెట్లా సాధ్యం’ అని ఎద్దేవా చేశారు. ఆ జిల్లాలు కాకతీయ కాల్వల పరిధిలో ఉన్నాయనీ, అందువల్లనే అవి తొలి ఫలితం అం దుకుంటాయనే కనీస అవగాహన కరువైన మీ పార్టీ భా వదారిద్య్రాన్ని చూసి నాడు నాతోపాటు, ప్రజలూ న వ్వుకున్నారు. ఇపుడు పాదయాత్ర సందర్భంగా మీరు ‘సూర్యాపేట జిల్లాలో పారుతున్నవి కాళేశ్వరం జలాలేనా?’ అని అడిగితే మళ్లీ అదేవిధంగా నవ్వుకుంటున్నారు.

భట్టి గారూ.. బాజాప్తా చెప్తున్నా. నిరూపణకు నేను సిద్ధం, మీరు సిద్ధమా? రండి, సూర్యాపేట జిల్లా కాల్వల్లో పారుతున్నది కాళేశ్వరం నీళ్లే అని మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. ఈ సంవత్సరం కూడా నీళ్లు వదులుతాం. మీరు రండి. కండ్లారా చూడండి. మేడిగడ్డ నుంచి సూర్యాపేట దాకా నీళ్లెట్లా చేరుతున్నాయో చూసేందుకు మీరూ, నేనూ పాత్రికేయ మిత్రులను తోడ్కొని మరీ పోదాం. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే వరదకాల్వ నుంచి ఎస్సారెస్పీలోకి రివర్స్‌ పంపింగ్‌ జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. అదే సమయంలో మిడ్‌ మానేర్‌ నుంచి లోయర్‌ మానేర్‌లోకి కూడా నీళ్లు చేరుతున్నాయి. అక్కడినుంచి కాకతీయ కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీళ్లొస్తాయి. మీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ నీళ్లల్లో మునిగితే కొంతైనా పాప పరిహారం జరుగుతుంది.

అవినీతికి ప్యాంటూ, షర్టూ తొడిగితే ఎలా ఉంటుంది? అచ్చం కాంగ్రెస్‌ నాయకుడిలా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. వాటిని వ్యాఖ్యలనే బదులు అసంబద్ధ, అన్యాయ, అక్రమ, ఆక్రోశ ప్రేలాపనలనడం సబబు. ఒకసారేమో పాత సెక్రటేరియట్‌ కింద 10 వేల కోట్లు దొరికినాయంటడు. ఇంకోసారేమో సెక్రటేరియట్‌ నుంచి ప్రగతిభవన్‌కు సొరంగం ఉందని వీరంగం వేస్తడు. మరోసారేమో కొత్త సెక్రటేరియట్‌ను నక్సలైట్లు పేల్చివేయాలంటడు. ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు సభ్యసమాజంలో తిరగడమే దురదృష్టకరం.

అసలు కాంగ్రెస్‌ నాయకులు నైతికత గురించి మాట్లాడటం అంటే.. అది పులులు, తోడేళ్లు శాకాహారం గురించి మాట్లాడినట్టే ఉంటుంది. జిత్తులమారి కాంగ్రెస్‌ వాళ్లు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలాకాలంగా ఒక విష ప్రచారాన్ని చేస్తున్నరు. కాంగ్రెస్‌ వాళ్ల వ్యాఖ్యలకు విలువలేదని తెలిసినప్పటికీ, నిజానిజాలు ప్రజల ముందుంచుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు అయిన ఖర్చే అక్షరాలా రూ.91,237 కోట్లు. లక్ష కోట్ల లోపు ఖర్చుతో నిర్మాణమైన ప్రాజెక్టులో, లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? మతి ఉండి మాట్లాడే మాటలా ఇవి? లేక ఉత్తగ బట్టకాల్చి మీద పారేయవచ్చు అనే బట్టేబాజ్‌ ఆలోచననా? ఏం మాట్లాడినా ప్రజలు గమనించరనే అడ్డగోలు తనమా; ఏమనుకోవాలె వీళ్ల గురించి? బాధ్యత కలిగిన నాయకులెవరూ ఇటువంటి ఆరోపణలు చేయరు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్నవి బేమాన్‌ ఆరోపణలు, బేకార్‌ ఆరోపణలు అని అర్థం చేసుకోవడానికి ఇసుమంత ఇంగితం సరిపోతుంది. అవివేకపు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించవచ్చనే కాంగ్రెస్‌ పార్టీ నాయకుల వైఖరి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనది. విష ప్రచారాలతో ప్రజల వివేకాన్ని చంపేయవచ్చునని అనుకునే నాయకులు రాజకీయాలను కలుషితం చేసే మురికి కాల్వల వంటివారు. ప్రతిపక్షంగా అధికారపక్షం మీద విమర్శలు చేయాలి. కానీ, అవి సత్యం పునాదుల మీద చేసే విమర్శలై ఉండాలి. అసత్యాలతో, అభూత కల్పనలతో రాజ్యాధికారంలోకి రావచ్చనుకోవడం ఉత్త ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు.

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్లమెంటులో ‘కాళేశ్వరంలో అవినీతి జరిగిందా?’ అని ప్రశ్నిస్తే, కేంద్ర జలశక్తిమంత్రి అయిన గజేంద్ర షెకావత్‌ ‘లేదు, అవినీతి జరగలేదు, జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు’ అని స్పష్టంగా జవాబిచ్చారు. అంటే మా శత్రుపక్షం బీజేపీ కూడా అంగీకరించక తప్పని నిజాయితీ మాది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలిచ్చిన ఆర్‌ఈసీ సంస్థ తామిచ్చిన రుణాలు వందకు వందశాతం సద్వినియోగం అయ్యాయని, కాళేశ్వరం కార్పొరేషన్‌ కు ‘ఏ’ గ్రేడ్‌ ప్రదానం చేసింది. నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడటంలో బీజేపీ కూడా కాంగ్రెస్‌కు తీసిపోదు. స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి, రూరల్‌ ఎలక్ట్రిఫికల్‌ కార్పొరేషన్‌ ‘కాళేశ్వరంలో అవినీతి జరగలేదు’ అని చెప్తుంటే.. ఆ పార్టీ నాయకులేమో పదే పదే అవే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నరు.

అబద్ధం ముందుపుట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌ పుట్టింది. ‘కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందలేదు’ అని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా కామెంట్స్‌ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగేయుల్లారా.. తెలంగాణ పాలిట కాలకేయుల్లారా.. రండి. మల్లన్నసాగర్‌ నుంచి, కొండపోచమ్మసాగర్‌ నుంచి నీళ్లు వదిలితే.. పొంగి పొరలిన కూడెల్లి, హల్దీ వాగులను చూడండి. నిండు గర్భిణుల్లా ఉన్న చెక్‌
డ్యాములను చూడండి.

అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయాల కింద 817 చెరువులను, 66 చెక్‌డ్యాములను నింపుతున్నాం. వాటిని చూసి తరించండి. ఈ చెరువులు, చెక్‌డ్యాములు, కాళేశ్వరం కాల్వల కింద 2 లక్షల 48 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని గ్రహించండి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 2,200 చెరువులను నింపడం ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థి రీకరణ చెందిందని తెలుసుకోండి. చేపల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగిందనీ, భూగర్భ జలాలు 5.36 మీటర్లు పైకి లేచాయని ఇకనైనా గమనించండి. గోదావరి నదిపై ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్‌ పూర్తికావడంతో 62.81 టీఎంసీల నీటి నిల్వ సాధ్యమైంది. ఇవాళ 200 కిలోమీటర్ల పొడవునా గోదావరి ఎన్నడూ ఎండిపోని సతత జీవధారగా మారింది. సమైక్య రాష్ట్రంలో కోటి టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. ఇవేవీ కాకమ్మ కథలు కావు. ప్రజల అనుభవంలో ఉన్న సత్యాలు. ఈ పరిణామమంతా మంత్రమేస్తెనో, మాయజేస్తెనో జరుగుతుందా? ‘తెలంగాణ అన్నపూర్ణగా మారింది’ అని ఆంధ్ర నాయకులు సైతం అయిష్టంగానైనా అంగీకరిస్తున్నారు కదా? కానీ, మీకేం మాయదారి రోగం? మీరిలా మాయమాటలు మాట్లాడుతున్నారు.

కరువులో సైతం తెలంగాణ వ్యవసాయాన్ని కామధేనువులా ఆదుకుంటున్న కాళేశ్వరం గురించి పిచ్చి ప్రేలాపనలు పేలితే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో, మాపై అబద్ధపు ఆరోపణలతో ప్రజలను ఏమార్చాలనుకునే కాంగ్రెస్‌ నాయకులకు కూడా అదే జరుగుతుంది. ఇది తథ్యం.

వ్యాసకర్త:
తన్నీరు హరీశ్‌ రావు గారు
రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామాత్యులు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat