నెల వ్యవధిలోనే విజయవంతంగా హైదరాబాద్‌లో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్ఎంసీ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నదని మంత్రి కేటీఆర్ అభినందించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. వార్డు కార్యాలయాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ర్టాలవారు వస్తారని చెప్పారు.
దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉడటం గర్వకారణమని చెప్పారు. ప్రతి నెలా మౌలిక వసతుల ఏర్పాటు, నిర్వహణ కోసం పట్టణ ప్రగతి కింద రూ.4,537 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ కార్పొరేషన్, పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు పట్టణాలకు రూ.4,706 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించామని తెలిపారు.
తొలి దశ అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రూ.7,100 కోట్లతో పట్టణాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ సెప్టెంబర్ నాటికి 100 శాతం మురికినీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఘనత సాధించిన తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. మూసీనదిపై 14 బ్రిడ్జిలను నూతనంగా నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వమే వచ్చే టర్మ్‌లో పూర్తి చేస్తుందని అన్నారు.