తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఓ విషాదం చోటుచేసుకున్నది. పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు చేశాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమి నలుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు.
భార్య ఈరవ్వ 30 ఏండ్ల క్రితం చనిపోయింది. కొడుకులు ఒక్కో చోట స్థిరపడ్డారు. పొట్లపల్లిలో ఇద్దరు, హుస్నాబాద్‌లో ఒకరు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో మరొకరు స్థిరపడ్డారు. వెంకటయ్యకు ఉన్న పది గుంటల భూమి విషయంలో కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి. వెంకటయ్యను ఒక్కో నెల ఒక్కో కొడుకు వద్ద వంతులవారీగా ఉండాలని తీర్మానించారు.
గ్రామంలో ఉన్న కొడుకులు సరిగ్గా తిండిపెట్టక పోవడం, ఇతర గ్రామాల్లో ఉన్న కొడుకుల వద్దకు వెళ్లలేని పరిస్థితిలో వెంకటయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన వ్యవసాయ భూమి సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద తాటి కమ్మలు, ఇతర కర్రలు పోగు చేసి చితిగా పేర్చుకొని నిప్పంటించి వెంకటయ్య అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాలిపోయిన స్థితిలో శవాన్ని గుర్తించిన చుట్టుపక్కలవారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు వెంకటయ్య శవంగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.