ప్రత్యేక హోదా.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరం. కాదు.. కాదు.. అత్యవసరం. దీనికి కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితి. మౌలిక వసతులు, నిరుద్యోగం, కరువు, తదితర సమస్యలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలన్నింటికీ ప్రత్యేక హోదానే పరిష్కారమంటూ రాజకీయ విశ్లేషకులు, విద్యా పండితులు ఓ పక్క వెల్లడిస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా పేరు చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిర్రెత్తుకొస్తోంది. నాడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అంటూ చిలక పలుకులు పలికి, అంతటితో ఆగక చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు తన కల్లబొల్లి హామీలతో బీజేపీతో జతకట్టి మరీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు… నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశారు. ప్రత్యేక హోదాపై తన కర్కశత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా చూపించారు చంద్రబాబు.
దీనికి నిదర్శనం నిన్న ఏపీ వ్యాప్తంగా జరిగిన ఘటనలే. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం విధితమే. ప్రత్యేక హోదాపై తమ అలసత్వం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో చంద్రబాబు సర్కార్ అఖిలపక్షం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే పక్కా ప్రణాళిక ప్రకారం అఖిలపక్షాలపై తన కర్కశత్వం చూపించింది చంద్రబాబు సర్కార్. ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ.. ప్రత్యేక హోదా సాధించాల్సిన చంద్రబాబు సర్కార్ తమకేమి పట్టనట్లు ఉండటం గమనార్హం.
అంతటితో ఆగక అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మిన్న అంటూ మరో సారి బల్లగుద్ది చెప్పి తన ఊసరవెళ్లి రాజకీయాలను మళ్లీ వెలుగులోకి తెచ్చారు చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతిఫలాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వంతో రాజీపడనని చెప్పుకునే చంద్రబాబు పాత రికార్డు తిరిగరాశారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం ఖర్చునూ కేంద్రం భరిస్తామనడమే తమ ఘనకార్యంగా వల్లె వేశారు. ‘సంజీవని’ కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ప్యాకేజీకి ఎందుకు తలూపారో ఆ మర్మాన్ని ప్రజలకు వెల్లడించాలి.
హోదా వలన ఎంత లబ్ధి చేకూరుతుంది ప్యాకేజీ వల న ఎన్ని నిధులొస్తాయి అనే వివరాలపై స్పష్టత ఎందుకు ఇవ్వ లేకపోతున్నారు? ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై బిజెపి, టిడిపి తలోమాట చెపుతున్నాయి. ఇద్దరూ కలిసి శ్వేత పత్రం విడుదల చేస్తే లోగుట్టు బయట పడుతుంది. ఆ పని చేయకుండా రెండు పార్టీలూ దోబూచులాడటం ప్రజలను వంచించడమే.