ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఎన్‌జీవో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌లను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
వాటితో పాటుగా అంగన్‌వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌లను కూడా మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ ఆచరణలో అమలుపరిచేది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున యావత్ భారతదేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచింది అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రధానంగా ఉందని ఆయన ప్రశంసించారు.